తిరుమలలో భక్తుల అనూహ్య రద్దీ

Dharani News
1 Min Read

*24 గంటలకు పైగా దర్శన సమయం

*ఆదివారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

తిరుమల, ధరణి న్యూస్ : తిరుమల శ్రీవారి క్షేత్రంలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. గురువారం నాటికి క్యూలైన్లలో వేచి ఉన్న సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం లభించేందుకు సుమారు 24 గంటల సమయం పడుతోంది. అంతేకాకుండా, ఈ నెల 12వ తేదీ నుండి 14వ తేదీ వరకు వరుస సెలవులు రానున్న నేపథ్యంలో కొండపైకి వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అంచనా వేస్తోంది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని, సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు సెప్టెంబర్ 13న (ఆదివారం) వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 12వ తేదీ శనివారం నాడు ఎటువంటి వీఐపీ సిఫార్సు లేఖలను స్వీకరించబోమని స్పష్టం చేసింది. బ్రేక్ దర్శనాలు రద్దు చేయడం ద్వారా ఆ సమయాన్ని కూడా సామాన్య భక్తుల దర్శనానికే కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఈ మార్పులను గమనించి టీటీడీ యాజమాన్యానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

📄 Generate e-Paper Clip
Share This Article