మెదక్ : మెదక్ జిల్లా అల్లాదుర్గ్ మండలం గడిపెద్దపూర్లో దారుణం చోటుచేసుకుంది. గర్భంలోని శిశువుకి డీఎన్ఏ (DNA) పరీక్ష చేయించాలంటూ భర్త, అత్త వేధించడంతో మనస్తాపానికి గురైన ఓ గర్భిణీ ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే.. గడిపెద్దపూర్కు చెందిన సుస్మితకు, అభిలాష్ అనే వ్యక్తితో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం సుస్మిత ఐదు నెలల గర్భిణీ. అయితే ఆమె ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త, అత్త..కడుపులో పెరుగుతున్న బిడ్డకు డీఎన్ఏ టెస్ట్ చేయించాలంటూ గత కొంతకాలంగా మానసికంగా,శారీరకంగా తీవ్రంగా హింసించారు. ఈ క్రమంలో వారి వేధింపులను భరించలేక, తీవ్ర మనస్తాపానికి గురైన సుస్మిత.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది. కాగా తన కూతురిది ఆత్మహత్య కాదని, భర్త, అత్త కలిసి హత్య చేశారని మృతురాలి తల్లి ఆరోపిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH)కి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.