శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ పరిధిలోని కైలాష్ నగర్ కాలనీ (సర్వే నెం. 210)లో మహిళా భవనం, ఫంక్షన్ హాల్ కోసం కేటాయించిన సుమారు రూ. 50 కోట్ల విలువైన 4 వేల గజాల ప్రభుత్వ భూమి కబ్జాదారుల పాలవుతోంది. స్థానిక ప్రజాప్రతినిధి అండతోనే మున్సిపల్ అధికారులు ఈ అక్రమాలకు వత్తాసు పలుకుతున్నారని చందానగర్ మాజీ కార్పొరేటర్, న్యాయవాది బొబ్బ నవతారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆమె ఉన్నతాధికారులకు ఘాటైన లిఖితపూర్వక ఫిర్యాదు సమర్పించారు. మహిళల అవసరాల కోసం ఈ స్థలాన్ని కేటాయిస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ 2018, 2019లలో అధికారిక ప్రొసీడింగ్స్ (LC1/3076/2016) జారీ చేశారు. 2019లో కార్పొరేషన్ అధికారులు ఇక్కడ ప్రహరీ గోడ, గేటు కూడా ఏర్పాటు చేశారు. 2022 ఆగస్టు 10న, అలాగే 2024 ఫిబ్రవరి 9న కబ్జాదారులు దౌర్జన్యంగా ఆ ప్రహరీని కూల్చివేసినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ స్థలంపై మాజీ కార్పొరేటర్ నవతారెడ్డి సమాచార హక్కు చట్టం (RTI) కింద వివరాలు కోరగా, “అది మా భూమి కాదు” అంటూ మున్సిపల్ అధికారులు బాధ్యతారాహిత్యంగా సమాధానమిచ్చారు. ఆ తర్వాత ఆమె కలెక్టర్ ఇచ్చిన పత్రాలను జతచేసి కమిషనర్, జోనల్ కమిషనర్లకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. మున్సిపల్ అధికారుల ఉదాసీనతను ఆసరాగా చేసుకుని, అదే స్థలంలో ఎలాంటి అధికారిక కేటాయింపు పత్రాలు లేకుండా TGSPDCL (విద్యుత్ శాఖ) సబ్‌స్టేషన్ నిర్మాణాన్ని చేపట్టింది. దీనిపై ఆర్టీఐ ద్వారా వివరణ కోరగా, కేవలం ప్రజాప్రతినిధుల సూచనతోనే కడుతున్నామని విద్యుత్ శాఖ తెలపడం గమనార్హం. టౌన్ ప్లానింగ్ అధికారులు కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారే తప్ప నిర్మాణాలను అడ్డుకోలేదు. కలెక్టర్ ప్రొసీడింగ్స్ ప్రకారం తక్షణమే ఆ భూమిని స్వాధీనం చేసుకుని, మహిళా భవనం, ఫంక్షన్ హాల్ నిర్మించాలి. ఉన్నతాధికారులు స్పందించి అక్రమ కట్టడాలను కూల్చివేయకపోతే, మహిళలను ఏకం చేసి పెద్ద ఎత్తున న్యాయపోరాటం, ప్రత్యక్ష ఆందోళనలు చేపడతాం అని బొబ్బ నవతారెడ్డి తెలిపారు.