మధురై, ధరణి న్యూస్, సెప్టెంబర్ 17 : ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తమిళనాడులోని మధురై శ్రీ మీనాక్షి సుందరేశ్వరర్ ఆలయ మహా కుంభాభిషేక (సంప్రోక్షణ) మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని అత్యంత వైభవంగా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగా ఆలయంలోని మొత్తం 12 గోపురాలను దాదాపు 5 టన్నుల రంగురంగుల పూలమాలలతో కంటికి ఇంపుగా అలంకరించారు. స్థానిక పుదు మండపం ప్రాంగణంలో గత రెండు రోజులుగా నైపుణ్యం కలిగిన కళాకారులు, సిబ్బంది రాత్రింబవళ్లు శ్రమించి ఈ సుదీర్ఘమైన పూలమాలలను ప్రత్యేకంగా సిద్ధం చేశారు. 40 అడుగుల నుండి 122 అడుగుల వరకు పొడవున్న ఈ భారీ మాలలను మీనాక్షి అమ్మవారు, సుందరేశ్వరుల బంగారు విమాన గోపురాలతో పాటు తూర్పు, పశ్చిమ, ఉత్తర మరియు దక్షిణ రాజగోపురాలకు అలంకరించారు. ఈ ఆచార కార్యక్రమానికి ముందు ఆలయ ప్రవేశద్వారం వద్దనున్న అష్టశక్తి మంటపంలోని శ్రీ వల్లభ వినాయకుడికి తొలి పూలమాల వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్తర గోపుర సమీపంలోని శ్రీ మహా మునీశ్వరుల ఆలయంలో ప్రార్థనలు చేసి వేద మంత్రోచ్ఛారణల నడుమ మొదటి పూలమాలను తూర్పు రాజగోపురంపైకి చేర్చారు. కేవలం తొమ్మిది అంతస్తుల ఎత్తున్న తూర్పు రాజగోపురాన్ని అలంకరించడానికే 50 మందికి పైగా సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. ఆలయ అధికారులు, అర్చకులు,సిబ్బంది సమన్వయంతో చేపట్టిన ఈ బృహత్తర అలంకరణలు కుంభాభిషేక వేడుకలకు విచ్చేసిన భక్తులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా మధురై నగరమంతటా ఆధ్యాత్మిక పండుగ వాతావరణాన్ని నింపాయి.