హైదరాబాద్, ధరణి న్యూస్, సెప్టెంబర్ 17: రేషన్ బియ్యం కేసులో బెయిల్ ఇప్పించేందుకు లంచం డిమాండ్ చేసిన కీసర సీఐ అంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డిలను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బుధవారం పట్టుకున్నారు.కేసు వివరాల ప్రకారం.. రేషన్ బియ్యం కేసులోని నిందితుల నుంచి బెయిల్ కోసం సీఐ, ఎస్‌ఐ కలిపి రూ. 10 లక్షల లంచం డిమాండ్ చేశారు. అంతేకాకుండా గత కొంతకాలంగా బాధితుల నుంచి బిర్యానీలు, కూల్‌డ్రింక్స్ తెప్పించుకుంటూ తమ పనులు చేయించుకుంటూ తీవ్రంగా వేధించారని సమాచారం. ఈ వేధింపులు తట్టుకోలేక బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ పక్కా ప్రణాళిక రచించింది. కీసర చెరువు వద్ద నిమజ్జనం డ్యూటీలో ఉన్న ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి కారులో రూ. 5 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేశారు. అధికారులను గమనించిన ఎస్‌ఐ అక్కడ నుంచి పరుగులు తీశాడు. అనంతరం సీఐ అంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డిలను అదుపులోకి తీసుకున్న అధికారులు వారికి కెమికల్ టెస్టులు నిర్వహించడానికి ప్రయత్నించగా వారు తీవ్రంగా నిరాకరించారు. ఈ ఘటనపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు.