హైదరాబాద్, ధరణి న్యూస్, సెప్టెంబర్ 17: తెలంగాణను ప్రపంచం గర్వించే రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు 4 కోట్ల ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగిన ‘తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ’ వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయమే తమ ప్రభుత్వ పునాదులని స్పష్టం చేసిన సీఎం, 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా “తెలంగాణ రైజింగ్ 2047” ప్రణాళికలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఇందులో భాగంగా 30 వేల ఎకరాల్లో తొలి నెట్-జీరో స్మార్ట్ సిటీగా ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ని తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. రైతులు, మహిళలు, పేదల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెబుతూ.. రూ.2 లక్షల వరకు పంట రుణాల మాఫీ, ‘మహాలక్ష్మి’ ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500 కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, 3.42 కోట్ల మందికి సన్న బియ్యం అందిస్తున్నామని వివరించారు. శాస్త్రీయ కుల సర్వే ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు దేశంలోనే తొలిసారిగా ఎస్సీ వర్గీకరణ చేపట్టి ఫిబ్రవరి 4ను “తెలంగాణ సోషల్ జస్టిస్ డే”గా జరుపుకుంటున్నట్లు చెప్పారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లు, స్కిల్స్ యూనివర్సిటీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు, 72 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతో పాటు మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవనం చేపడుతున్నామని ఈ సందర్బంగా స్పష్టం చేశారు.