షాద్‌నగర్, ధరణి న్యూస్, సెప్టెంబర్ 18 : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పాఠశాల మెట్లపై నుంచి జారిపడి నాలుగో తరగతి చదువుతున్న వర్ణిక (9) అనే విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో స్థానికంగా కలకలం రేగింది. షాద్‌నగర్‌లోని సదరు ప్రైవేట్ పాఠశాలలో వర్ణిక 4వ తరగతి అభ్యసిస్తోంది. గురువారం నాడు పాఠశాల సమయంలో మెట్లపై నుంచి కిందకు వస్తుండగా పాప ఒక్కసారిగా కాల జారి కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో వర్ణిక తలకు తీవ్రంగా బలమైన గాయమైంది. ప్రమాదాన్ని గమనించిన పాఠశాల సిబ్బంది వెంటనే స్పందించి, తీవ్రంగా గాయపడిన చిన్నారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో వైద్యులు చికిత్స అందించినప్పటికీ, తలకు తీవ్ర గాయం కావడంతో పరిస్థితి విషమించి శుక్రవారం ఉదయం చిన్నారి చికిత్స పొందుతూ కన్నుమూసింది. వర్ణిక మృతితో ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పాఠశాలలో జరిగిన ఈ ప్రమాద దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. పాప మెట్లపై నుంచి ఎలా జారిపడిందో సీసీటీవీ ఫుటేజ్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం ఉందా లేక ప్రమాదవశాత్తూ జరిగిందా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. చిన్నారి అకాల మరణంతో పాఠశాలతో పాటు షాద్‌నగర్ ప్రాంతంలోనూ తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.