సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఐదేళ్ల బాలుడు కిడ్నాప్

Dharani News
1 Min Read

*11 రోజులు గడిచినా దొరకని ఆచూకీ

హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వేదికగా ఒక ఐదేళ్ల బాలుడు అదృశ్యమై 11 రోజులు కావస్తున్నా, ఇప్పటికీ బాలుడి ఆచూకీ లభించకపోవడంతో ఆ కుటుంబం ఆందోళనలో మునిగిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.ఉప్పల్ చిలకనగర్ ప్రాంతానికి చెందిన రాపు రాజేశ్వరి తన ఐదేళ్ల కుమారుడు నిఖిల్, తల్లి స్వరూపతో కలిసి నివసిస్తోంది. గత నెల జూన్ 20వ తేదీన కుటుంబ కలహాల నేపథ్యంలో, స్వరూప తన మనవడు నిఖిల్‌ను తీసుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లింది. అక్కడ ప్లాట్‌ఫామ్ నంబర్ 1పై వారు విశ్రాంతి తీసుకుంటుండగా, ఒక్కసారిగా చిన్నారి నిఖిల్ కనిపించకుండా పోయాడు. ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో, స్వరూప కంగారుగా ఇంటికి చేరుకుని తన కూతురు రాజేశ్వరికి జరిగిన విషయాన్ని వివరించింది.ఈ ఘటనపై బాధితులు జూన్ 21న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, ఒక గుర్తు తెలియని వ్యక్తి చిన్నారి నిఖిల్‌ను తీసుకువెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ వ్యక్తిని బాలుడిని అపహరించిన కిడ్నాపర్‌గా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.కిడ్నాప్ జరిగి 11 రోజులు గడుస్తున్నా, పోలీసులు ఇప్పటివరకు బాలుడిని గుర్తించలేదని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ బిడ్డ ఎక్కడున్నాడో, ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలియక తల్లి రాజేశ్వరి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారిని క్షేమంగా తిరిగి తీసుకురావాలని వారు పోలీసులను వేడుకుంటున్నారు. పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని, నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.ఈ దురదృష్టకర సంఘటనపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article