రంగారెడ్డి, ధరణి న్యూస్, సెప్టెంబర్ 11 : ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు భారీ మాదకద్రవ్యాల రాకెట్‌ను గుట్టురట్టు చేశారు. ఎస్‌ఓటీ మహేశ్వరం జోన్ బృందం, కందుకూరు పోలీసులు ఉమ్మడిగా నిర్వహించిన తనిఖీల్లో శ్రీశైలం హైవేపై నవరు బాల్‌రెడ్డి ఫంక్షన్ హాల్ సమీపంలో మారుతి స్విఫ్ట్ కారును అడ్డుకుని సుమారు రూ.1.50 కోట్ల విలువైన 11 కిలోల హాషిష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ప్రధాన డ్రగ్ పెడ్లర్ మొరుపోజు రవి వర్మ (27)తో పాటు పెడ్లర్లు-కమ్-వినియోగదారులైన జర్పుల లోకేష్ (26), సయ్యద్ సోహైల్ హుస్సేన్ (27)లను అరెస్ట్ చేశారు. విశాఖ జిల్లా లంబసింగికి చెందిన ‘బన్నీ’ అనే సరఫరాదారు ని వద్ద కొత్తపేటలో సెల్ఫ్ డ్రైవ్‌కు తీసుకున్న కారులో వెళ్లి రూ.9.5 లక్షలకు హాషిష్ ఆయిల్ కొనుగోలు చేసినట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. పోలీసు తనిఖీల నుంచి తప్పించుకునేందుకు ఖమ్మం, మిర్యాలగూడ, దేవరకొండ, కల్వకుర్తి మార్గాల గుండా హైదరాబాద్‌కు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 11 కిలోల హాషిష్ ఆయిల్, 2 మొబైల్ ఫోన్లు, కారును స్వాధీనం చేసుకుని కందుకూరు పోలీస్ స్టేషన్‌లో ఎన్‌డీపీఎస్ (NDPS) చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఆపరేషన్‌ను ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి పర్యవేక్షణలో మహేశ్వరం జోన్ డీసీపీ కె. నారాయణ రెడ్డి మార్గదర్శకత్వంలో ఎస్‌ఓటీ, స్థానిక పోలీసులు విజయవంతంగా పూర్తి చేశారు.