శేరిలింగంపల్లి, ఆగష్టు 01: చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ జ్యువెలరీ షాప్‌లో శుక్రవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. షాప్ వెనుక భాగంలో గోడకు రంధ్రం చేసి లోపలికి ప్రవేశించిన దుండగులు రూ. లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చందానగర్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ పక్కనే ఉన్న బాలాజీ జ్యూవెలరీ షాప్ వెనుక వైపు ఉన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను తొలగించి గోడకు రంధ్రం చేసి దొంగలు లోపలికి చొరబడ్డారు. అనంతరం వెనుక గది నుంచి ముందు గదికి ఉన్న తలుపుకు కూడా రంధ్రం చేసి షాప్‌లో భద్రపరిచిన ఆభరణాలను దోచుకెళ్లారు. ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు 7 తులాల బంగారం, 4 కిలోల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు అధికారులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న వెంటనే డీసీపీ చింతమనేని శ్రీనివాస్, ఏసీపీ సీహెచ్. వై. శ్రీనివాస్ కుమార్, సీసీఎస్, ఎస్‌వోటీ చందానగర్ పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలంలో వేలిముద్రలు, ఇతర కీలక ఆధారాలను సేకరించారు. సీసీటీవీ ఫుటేజ్‌తో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితులను వీలైనంత త్వరగా గుర్తించి అరెస్టు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాలను రంగంలోకి దించినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.